Sunday, June 7, 2009

Radio Jokey (రేడియో రౌతు) ఇంటర్వ్యూ ఎలా చెయ్యాలి?

ఏంటమ్మా! నీలో నువ్వు ఏదో మాట్లాడుకుంటున్నావు ? మధ్యమధ్యలో పాటలు పాడుతున్నావు ? ఏమిటి సంగతి ?
ఏంలేదు! రేడియో స్పందనలో ఆర్జే ఇంటర్వ్యు వచ్చింది. ప్రిపేరు అవుతున్నాను.
ఓస్! దానికేందుకమ్మ అంత శ్రమ. అసలు ప్రిపరేషను అంటూ టైం వేస్టు చేసుకోకమ్మా. జస్ట్ అలా వెళ్లి పో. నీకు తోచినట్లు మాట్లాడేయ్.
అదేంటి పిన్ని గారూ? అంత తేలిగ్గా చెప్పేస్తున్నారు.
సరే, నే చెప్పేది విను. ఇంటర్వ్యూలో ఎం చెయ్యాలో, ఎలా చెయ్యాలో నే చెబుతా విను. శంకరాభరణం, దసరా బుల్లోడు, మేఘసందేశం, దేవదాసు... సినిమాల పాటలు మళ్ళీ మళ్ళీ వేస్తుంటారు. నువ్వు పాటకూ, పాటకూ మధ్య తోచింది మాట్లాడు. శంకరాభరణంలో శంకరశాస్త్రిగారు కట్టుకున్న పొందూరు ధోవతి చూసి అప్పుడందరూ అవే ఎగబడి కొనుక్కున్నారని; మేఘసందేశంలో జయసుధగారి జాకెట్టు డిజైను చూసి అందరూ అలాంటివే కుట్టించుకున్నారని ...ఇలా నీకు తోచింది మాట్లాడేయ్.
ఇంకో సంగతి! ప్రతి రోజూ ఎవరిదో ఒకరి పుట్టిన రోజు అవుతుంది కాబట్టి నువ్వు పక్కింటి సుబ్బారావుకో, సుబ్బమ్మకో గంటకు నాలుగైదుసార్లు పుటిన రోజు శుభాకాంక్షలు చెప్పేస్తూ మధ్యలో సగం సగం పాటలు వేసేయ్! మళ్ళీ మళ్ళీ మిమిక్రీ ధ్వనులతో అరుస్తూ, కరుస్తూ మాట్లాడుతూ పాటలు పెట్టేయ్.
అదేంటి పిన్ని గారూ? వినేవాళ్ళకు బోరు కొట్టదా ఇలా ప్రోగ్రాములు చేస్తే?
ఓ విషయం చెప్పమంటావా తల్లీ, గత ఆరేడు నెలలుగా రేడియో స్పందనలో ప్రోగ్రాములు వినీ వినీ చాలా మంది నెత్తీ, నోరూ బాదుకున్నా వినే నాధుడు లేడమ్మా! అలాంటప్పుడు నీకెందుకే బోరూ, బాధలూ అంటూ. ఇక వెళ్ళు.

No comments: