Sunday, May 31, 2009

రేడియో స్పందన - పాత వుత్తరాలు (27.10.05)

సుస్వరాల సుష్మ గారూ!
ఈ రోజు 'రక్త సంబంధం' సినిమా గురించి మాట్లాడుతూ రామారావు ఫోటో గురించి most copied photo అని ఏదేదో మాట్లాడారు. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా చలనచిత్రసీమలో నిలచిపోయిన చరిత్ర - రక్తసంబంధం. ఆ సినిమా పేరు చెప్పగానే అందరికీ గుర్తు వచ్చేది ఆ కథే! ఆ పాటే! ఎంతో వుదాత్తంగా ప్రస్తావించాల్సిన అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని వదిలేసి, ఇంకేం మాట్లాడినా పేలవంగా వుంటుంది. ఒక మంచి పాట వేసేటప్పుడు, ఒక మంచి వుపోద్ఘాతం ఎంతో అవసరం కదా! ఏమంటారు?
భవదీయుడు,
బాపూజీ

Saturday, May 30, 2009

రేడియో స్పందన - పాత వుత్తరాలు (25.07.05)

పాడిన పాటే పాడరా! పాచి పండ్ల దాసరీ! అన్న చందాన రోజూ అవే పాటలు వేసి వేసి శ్రోతలను బాధ పెడుతున్న ఘనత రేడియో స్పందనకే దక్కుతుంది. వేళాపాళా లేకుండా ప్రొద్దున్నే మిడ్నైట్ మసాలా సాంగ్ పెట్టే విచక్షణా జ్ఞానం కూడా చాలా గొప్పదే! (ఆదివారం 24.07.05 ప్రొద్దున ఏడు గంటలకు ఆ అంటే అమలాపురం .... పాట వేసారు.) నిన్ననే కదండీ జావళి అంటూ 'పిలచిన బిగువటరా' పాట వేసారు. ఇవాళ మళ్ళీ మృణాలిని గారు కూడా 'భావవీచికలు' లో అదే పాట వేసారు. యాదృచ్చికం అని సరిపెట్టుకోమంటారా!
ఇంకో విషయం, సాయంత్రం పూట మ్యూజికల్ షికారు అంటూ ఏకంగా నాలుగు గంటల పాటు మా కర్ణభేరులను నలగగొట్టడం మీకు భావ్యమేనా? కావాలంటే ఓ గంట పాటు ఆ నందు గారిని మమ్మల్ని చిత్రవధ చేసి ఆనందించుకోమనండి.
బస్సు దిగేవాళ్ళను దిగనివ్వకుండా బస్సులోకి ఎక్కే వాళ్ళలా పాట పూర్తిగా అయిపోక ముందే స్పందనా...స్పందనా అని దూసుకు రావాలా? కాస్త ఆగి రాకూడదా?