Wednesday, June 24, 2009

మా మంచి రేడియో స్పందన

గజిబిజిగా గమ్మతుగా మాట్లాడుతూ
మంచిపాటలు వేస్తూ
సుప్రభాతం చెప్పే సుస్వరాల సుష్మ గారూ!
మీ ప్రియను నేనంటూ
మధుర స్వరంతో
ప్రియరాగాలు అందించే ప్రియా !
నేను నందూను అంటూ
నాన్ స్టాపుగా మాట్లాడుతూ
లేటెస్ట్ పాటలు వినిపించే నందూ !
మంచి పాటలే కాదు
మంచి మాటలు కూడా వినండంటూ
సాహితీ కుసుమాలను చక్కటి వ్యాఖ్యానంతో
అందిచే మృదుభాషిని మృణాళిని గారూ !
మా శ్రోతల హృదయాల
స్పందనల ప్రతిరూపమే
మీరందరూ మా రేడియో స్పందనలో!

Monday, June 8, 2009

అపస్వరాలు - ఆర్జే అప్పారావు గారి సుత్తి ప్రోగ్రాం

శుభోదయం! గుడ్మార్నింగ్ ! వణక్కం!
నేనండీ! అపస్వరాల ప్రోగ్రాం ఆర్జే అప్పారావు నండీ! ఈ రోజు కూడా సూర్యుడు తూర్పున్నే ఉదయించేశాడండీ! తూర్పంటే గుర్తొచ్చిందండీ! మా వూరు తూర్పు గోదావరి జిల్లాలో అంబాజీపేట అండీ! అమలాపురం పక్కనే వుంటుందండీ! ఇక ఇప్పుడీ పాట వినండీ!
ఆ అంటే అమలాపురం .........
నాకసలు ఈ ఆర్జే అవాలనే కోరికెలావోచ్చిందో చెప్పమంటారా? అదేదో రేడియో స్పందనలో మా ప్రక్కింటి అమ్మాయి సుష్మండీ, ప్రొద్దున్నే సుస్వరాలు అనే ప్రోగ్రాం చేస్తుందండీ. ఆ ప్రోగ్రాం విన్నాక, ఓస్ ఇంతేనా అన్పించిందండీ! ఏదైనా మాట్లాడవచ్చండీ! మధ్యమధ్యలో కాస్త పాటలు వేస్తుండాలి. అంతేనండీ! ఇప్పుడీ పాట వినండి.
శంకరా! నాద శరీరాపరా! .......
శంకరాభరణం సినిమాలో మంజుభార్గవి గారు చాలా బాగా చేసారండీ! అయితే పాపం, ఆ తర్వాత ఆవిడకి కాబరే డాన్సుల చాన్సులు తగ్గిపోయాయండీ. ఏంచేస్తాం చెప్పుల సినిమాలో చిరంజీవి అంత బాగా చేస్తేనే ఆయన అభిమానులు ఒప్పుకోలేదు. ఇప్పుడీ పాట వేసుకుందాం రండి.
గాజువాక పిల్లా..........
ఇందాక మా వూరు అంబాజీపేట అన్నాను కదండీ! అంబాజీపేట ఆముదం అని వింటూవుంటాం కదండీ! కాని అంబాజీపేటలో కొబ్బరికాయలు దొరుకుతాయి గాని ఆముదం కాదండీ! మరెందుకు అలా అనుకుంటారో తెలీదు. సరే, ఇప్పుడీ పాట వినండి.
లే లే రాజా, నన్ను లేపమంటావా?.........
ఏదో రాత్రి పూట వేయాల్సిన ఈ పాట ఇప్పుడెందుకు పెట్టానని ఆలోచిస్తున్నారా? రాత్రి రంజైన కలలు కంటూ నిద్రపోయిన కుర్రాళ్ళని లేపాలంటే ఇదే దారండీ! ఏ వెంకటేశ్వర సుప్రభాతమో విని లేస్తారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇక అంబాజీపేట విషయానికొద్దాం. సీజన్లో పనసకాయలు బాగా దొరుకుతాయండీ! కొండకాయలకన్న ఇవే తియ్యగా వుంటాయండీ! ఇక ఈ పాట విందామా?
ము..ము.. ముద్దంటే చేదా? .......
కాస్సేపు అంబాజీపేట విషయాలు ఆపేసి వేరే మాట్లాడుకుందామా? ఆర్జే అంటే ఏదైనా మాట్లాడుతూ పాటలు వేస్తూ వుంటే చాలండీ. శ్రీ శ్రీ గారన్నట్లు మనం కేవలం సబ్బుబిళ్ళ, అగ్గిపెట్టె, కుక్కపిల్ల గురించి మాత్రమే కాదు, దేని గురించయినా మాట్లాడుకోవచ్చండీ. కావాలంటే ఎ సెల్ఫ్ కాన్ఫిడెన్సు గురించో లేదా అమల గారి బ్లూ క్రాస్ గురించో వసపిట్టలా మాట్లాడాలండీ! ఇదో మరో పాట మీ కోసం.
కోతీ బావకు పెళ్ళంట ...........
కోతులంటే గుర్తొచ్చిందండీ. ఆ మధ్య తిరుపతి వెళ్ళినప్పుడు కోతులసలు కనబడలేదండీ! వాకబు చేస్తే తెలిసిందేమంటే అన్ని కోతి పనులు మనుషులే చేస్తుంటే, మేమెందుకని కోతులన్నీ ఎక్కడికో వెళ్లి పోయాయటండీ! రండి. ఇదిగో ఓ మంచి పాట.
దొరకునా ఇటువంటి సేవ ......
ఓ మంచి పాట వేసానన్న తృప్తితో నా ఈ అపస్వరాల ప్రోగ్రాంను ముగిస్తున్నాను. రేపు మళ్ళీ ఇదే టైముకు మళ్ళీ కలుస్తాను. బై బై ..

Sunday, June 7, 2009

Radio Jokey (రేడియో రౌతు) ఇంటర్వ్యూ ఎలా చెయ్యాలి?

ఏంటమ్మా! నీలో నువ్వు ఏదో మాట్లాడుకుంటున్నావు ? మధ్యమధ్యలో పాటలు పాడుతున్నావు ? ఏమిటి సంగతి ?
ఏంలేదు! రేడియో స్పందనలో ఆర్జే ఇంటర్వ్యు వచ్చింది. ప్రిపేరు అవుతున్నాను.
ఓస్! దానికేందుకమ్మ అంత శ్రమ. అసలు ప్రిపరేషను అంటూ టైం వేస్టు చేసుకోకమ్మా. జస్ట్ అలా వెళ్లి పో. నీకు తోచినట్లు మాట్లాడేయ్.
అదేంటి పిన్ని గారూ? అంత తేలిగ్గా చెప్పేస్తున్నారు.
సరే, నే చెప్పేది విను. ఇంటర్వ్యూలో ఎం చెయ్యాలో, ఎలా చెయ్యాలో నే చెబుతా విను. శంకరాభరణం, దసరా బుల్లోడు, మేఘసందేశం, దేవదాసు... సినిమాల పాటలు మళ్ళీ మళ్ళీ వేస్తుంటారు. నువ్వు పాటకూ, పాటకూ మధ్య తోచింది మాట్లాడు. శంకరాభరణంలో శంకరశాస్త్రిగారు కట్టుకున్న పొందూరు ధోవతి చూసి అప్పుడందరూ అవే ఎగబడి కొనుక్కున్నారని; మేఘసందేశంలో జయసుధగారి జాకెట్టు డిజైను చూసి అందరూ అలాంటివే కుట్టించుకున్నారని ...ఇలా నీకు తోచింది మాట్లాడేయ్.
ఇంకో సంగతి! ప్రతి రోజూ ఎవరిదో ఒకరి పుట్టిన రోజు అవుతుంది కాబట్టి నువ్వు పక్కింటి సుబ్బారావుకో, సుబ్బమ్మకో గంటకు నాలుగైదుసార్లు పుటిన రోజు శుభాకాంక్షలు చెప్పేస్తూ మధ్యలో సగం సగం పాటలు వేసేయ్! మళ్ళీ మళ్ళీ మిమిక్రీ ధ్వనులతో అరుస్తూ, కరుస్తూ మాట్లాడుతూ పాటలు పెట్టేయ్.
అదేంటి పిన్ని గారూ? వినేవాళ్ళకు బోరు కొట్టదా ఇలా ప్రోగ్రాములు చేస్తే?
ఓ విషయం చెప్పమంటావా తల్లీ, గత ఆరేడు నెలలుగా రేడియో స్పందనలో ప్రోగ్రాములు వినీ వినీ చాలా మంది నెత్తీ, నోరూ బాదుకున్నా వినే నాధుడు లేడమ్మా! అలాంటప్పుడు నీకెందుకే బోరూ, బాధలూ అంటూ. ఇక వెళ్ళు.

Tuesday, June 2, 2009

వినాలనుంది - యమరాగాలు

ఏమి చిత్రగుప్తా? ఈ మధ్య రోజూ భోజనానికి వెళ్లి ఆలస్యంగా వస్తున్నావు? ఏమిటి సంగతి?
ఏమీ లేదు ప్రభూ, ఉపగ్రహవాణి ద్వారా వచ్చే రేడియో స్పందనలో ప్రియరాగాలు అనే కార్యక్రమంలో వేసే చిత్రసంగీతాన్ని విని వస్తూండటం వల్ల కాస్త ఆలస్యం అవుతోంది ప్రభూ!
అదేమీ వాణి? ఆకాశవాణి విన్నాము కానీ ఈ ఉపగ్రహ వాణి ఏమిటి?
ఎవరైనా ఎక్కడైనా సంగీతం, వార్తలు వినేటట్లు ఈ మానవులు ఉపగ్రహం ద్వారా ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ప్రభూ!
అయితే చిత్రగుప్తా, వారితో మాట్లాడి మన యమలోకంలో కూడా వినబడేటట్లు యమరాగాలు అనే ప్రోగ్రాము తయారు చేద్దాం. శిక్షలు అనుభవించే వారు ఈ యమరాగాలు వింటూ కాస్త ఆనందంగా వుంటారు కదా! అలాగే ఈ ప్రోగ్రాము చేయడానికి మనలో ఎవరున్నారో కాస్త చూడు.
అదేమీ కష్టం కాదు ప్రభూ, గోరంత విషయాన్ని కొండంతగా, పీచు మిఠాయిని సాగదీసినట్లు ఏదో విషయాన్ని మాట్లాడే టాలెంటు వుంటే చాలు. మధ్య మధ్య కాస్త చిత్రసంగీతం వేస్తే చాలు. పాటల చిట్టా వుండును. దానిని చూసి ఏదో పాట వేసేస్తే సరిపోతుంది.
చిత్రగుప్తా, నువ్వు చెప్పేది నమ్మశక్యం కావడం లేదు. వారికి కాస్త ట్రెయినింగు ఇచ్చినచో బాగుండును కదా?
సరే ప్రభూ, మన ఆడ భటులలో ఓ ఇద్దరిని లక్ష్మీ శరత్ , ప్రతిభ ల దగ్గరికీ పంపిస్తాను.
వారెవ్వరు చిత్రగుప్తా?
వారా ప్రభూ? ఇంతకు ముందు రేడియో స్పందనలో తెలుగు భాషను చిత్రవధ చేస్తూ శ్రోతలను నానా విధముగా హింసించిన అనుభవజ్ఞులు. వీరిద్దరిలో ఒకరికి అవార్డు కూడా ఇచ్చారు ప్రభూ!
అయితే సరే చిత్రగుప్తా! వెంటనే ఏర్పాటు చేసేయ్. మన యమరాగాలు ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా వినాలనుంది!

Sunday, May 31, 2009

రేడియో స్పందన - పాత వుత్తరాలు (27.10.05)

సుస్వరాల సుష్మ గారూ!
ఈ రోజు 'రక్త సంబంధం' సినిమా గురించి మాట్లాడుతూ రామారావు ఫోటో గురించి most copied photo అని ఏదేదో మాట్లాడారు. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా చలనచిత్రసీమలో నిలచిపోయిన చరిత్ర - రక్తసంబంధం. ఆ సినిమా పేరు చెప్పగానే అందరికీ గుర్తు వచ్చేది ఆ కథే! ఆ పాటే! ఎంతో వుదాత్తంగా ప్రస్తావించాల్సిన అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని వదిలేసి, ఇంకేం మాట్లాడినా పేలవంగా వుంటుంది. ఒక మంచి పాట వేసేటప్పుడు, ఒక మంచి వుపోద్ఘాతం ఎంతో అవసరం కదా! ఏమంటారు?
భవదీయుడు,
బాపూజీ

Saturday, May 30, 2009

రేడియో స్పందన - పాత వుత్తరాలు (25.07.05)

పాడిన పాటే పాడరా! పాచి పండ్ల దాసరీ! అన్న చందాన రోజూ అవే పాటలు వేసి వేసి శ్రోతలను బాధ పెడుతున్న ఘనత రేడియో స్పందనకే దక్కుతుంది. వేళాపాళా లేకుండా ప్రొద్దున్నే మిడ్నైట్ మసాలా సాంగ్ పెట్టే విచక్షణా జ్ఞానం కూడా చాలా గొప్పదే! (ఆదివారం 24.07.05 ప్రొద్దున ఏడు గంటలకు ఆ అంటే అమలాపురం .... పాట వేసారు.) నిన్ననే కదండీ జావళి అంటూ 'పిలచిన బిగువటరా' పాట వేసారు. ఇవాళ మళ్ళీ మృణాలిని గారు కూడా 'భావవీచికలు' లో అదే పాట వేసారు. యాదృచ్చికం అని సరిపెట్టుకోమంటారా!
ఇంకో విషయం, సాయంత్రం పూట మ్యూజికల్ షికారు అంటూ ఏకంగా నాలుగు గంటల పాటు మా కర్ణభేరులను నలగగొట్టడం మీకు భావ్యమేనా? కావాలంటే ఓ గంట పాటు ఆ నందు గారిని మమ్మల్ని చిత్రవధ చేసి ఆనందించుకోమనండి.
బస్సు దిగేవాళ్ళను దిగనివ్వకుండా బస్సులోకి ఎక్కే వాళ్ళలా పాట పూర్తిగా అయిపోక ముందే స్పందనా...స్పందనా అని దూసుకు రావాలా? కాస్త ఆగి రాకూడదా?

Monday, April 20, 2009

అరుణమ్: హేపీ జర్నీ!

అరుణమ్: హేపీ జర్నీ!
ప్రయాణాలను మించిన అనుభవం జీవితంలో వుండదేమో ! ఎన్ని పుస్తకాలు చదివినా రాని వివేకం, లౌక్యం, ప్రపంచజ్ఞానం ప్రయాణాల ద్వారా ఒక వ్యక్తికి ఒనగూడుతుందంటే అతిశయోక్తి కాదేమో !