Monday, June 8, 2009

అపస్వరాలు - ఆర్జే అప్పారావు గారి సుత్తి ప్రోగ్రాం

శుభోదయం! గుడ్మార్నింగ్ ! వణక్కం!
నేనండీ! అపస్వరాల ప్రోగ్రాం ఆర్జే అప్పారావు నండీ! ఈ రోజు కూడా సూర్యుడు తూర్పున్నే ఉదయించేశాడండీ! తూర్పంటే గుర్తొచ్చిందండీ! మా వూరు తూర్పు గోదావరి జిల్లాలో అంబాజీపేట అండీ! అమలాపురం పక్కనే వుంటుందండీ! ఇక ఇప్పుడీ పాట వినండీ!
ఆ అంటే అమలాపురం .........
నాకసలు ఈ ఆర్జే అవాలనే కోరికెలావోచ్చిందో చెప్పమంటారా? అదేదో రేడియో స్పందనలో మా ప్రక్కింటి అమ్మాయి సుష్మండీ, ప్రొద్దున్నే సుస్వరాలు అనే ప్రోగ్రాం చేస్తుందండీ. ఆ ప్రోగ్రాం విన్నాక, ఓస్ ఇంతేనా అన్పించిందండీ! ఏదైనా మాట్లాడవచ్చండీ! మధ్యమధ్యలో కాస్త పాటలు వేస్తుండాలి. అంతేనండీ! ఇప్పుడీ పాట వినండి.
శంకరా! నాద శరీరాపరా! .......
శంకరాభరణం సినిమాలో మంజుభార్గవి గారు చాలా బాగా చేసారండీ! అయితే పాపం, ఆ తర్వాత ఆవిడకి కాబరే డాన్సుల చాన్సులు తగ్గిపోయాయండీ. ఏంచేస్తాం చెప్పుల సినిమాలో చిరంజీవి అంత బాగా చేస్తేనే ఆయన అభిమానులు ఒప్పుకోలేదు. ఇప్పుడీ పాట వేసుకుందాం రండి.
గాజువాక పిల్లా..........
ఇందాక మా వూరు అంబాజీపేట అన్నాను కదండీ! అంబాజీపేట ఆముదం అని వింటూవుంటాం కదండీ! కాని అంబాజీపేటలో కొబ్బరికాయలు దొరుకుతాయి గాని ఆముదం కాదండీ! మరెందుకు అలా అనుకుంటారో తెలీదు. సరే, ఇప్పుడీ పాట వినండి.
లే లే రాజా, నన్ను లేపమంటావా?.........
ఏదో రాత్రి పూట వేయాల్సిన ఈ పాట ఇప్పుడెందుకు పెట్టానని ఆలోచిస్తున్నారా? రాత్రి రంజైన కలలు కంటూ నిద్రపోయిన కుర్రాళ్ళని లేపాలంటే ఇదే దారండీ! ఏ వెంకటేశ్వర సుప్రభాతమో విని లేస్తారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇక అంబాజీపేట విషయానికొద్దాం. సీజన్లో పనసకాయలు బాగా దొరుకుతాయండీ! కొండకాయలకన్న ఇవే తియ్యగా వుంటాయండీ! ఇక ఈ పాట విందామా?
ము..ము.. ముద్దంటే చేదా? .......
కాస్సేపు అంబాజీపేట విషయాలు ఆపేసి వేరే మాట్లాడుకుందామా? ఆర్జే అంటే ఏదైనా మాట్లాడుతూ పాటలు వేస్తూ వుంటే చాలండీ. శ్రీ శ్రీ గారన్నట్లు మనం కేవలం సబ్బుబిళ్ళ, అగ్గిపెట్టె, కుక్కపిల్ల గురించి మాత్రమే కాదు, దేని గురించయినా మాట్లాడుకోవచ్చండీ. కావాలంటే ఎ సెల్ఫ్ కాన్ఫిడెన్సు గురించో లేదా అమల గారి బ్లూ క్రాస్ గురించో వసపిట్టలా మాట్లాడాలండీ! ఇదో మరో పాట మీ కోసం.
కోతీ బావకు పెళ్ళంట ...........
కోతులంటే గుర్తొచ్చిందండీ. ఆ మధ్య తిరుపతి వెళ్ళినప్పుడు కోతులసలు కనబడలేదండీ! వాకబు చేస్తే తెలిసిందేమంటే అన్ని కోతి పనులు మనుషులే చేస్తుంటే, మేమెందుకని కోతులన్నీ ఎక్కడికో వెళ్లి పోయాయటండీ! రండి. ఇదిగో ఓ మంచి పాట.
దొరకునా ఇటువంటి సేవ ......
ఓ మంచి పాట వేసానన్న తృప్తితో నా ఈ అపస్వరాల ప్రోగ్రాంను ముగిస్తున్నాను. రేపు మళ్ళీ ఇదే టైముకు మళ్ళీ కలుస్తాను. బై బై ..

No comments: